ఓ కనపడని ప్రియతమా !!

నీతో నేను చాల దగ్గరగా ఉన్న సమయం ,నిన్ను చాలా ఆప్యాయంగా పలకరించే సమయం, ఎప్పుడో తెలుసా ? నేను నీకోసం వెతికేటప్పుడే! నేను ఈ లోకం లోనే ఉన్నాను అని ఆలోచించే సమయం ఎక్కడిది ?

నా పని లో నేను ఉండిపోతున్నాను. నా బాధలు, ఆనందాలు, అనుభవాలు

వాటి తోనే నా రోజు అయిపోతుంది.

నిద్ర లో నిన్ను తలుచుకునే శక్తీ లేదు.

కానీ ఏదో ఒక సమయం లో, నాతో నేను కూర్చున్నపుడు నువ్వు గుర్తొస్తావ్.

నా శ్వాస లో నీ ప్రేమ కనపడుతుంది, నా ఆలోచనల్లో నిండిపోతావ్, ఆ సమయం లో.

నా చుట్టూ నువ్వే కనిపిస్తావు, నువ్వు తప్ప వేరే ఆలోచనే ఉండదు.

అప్పుడు నీకోసం వెతకడం మొదలుపెడతాను, ఆలోచిస్తాను.. నువ్వు ఎక్కడ వుంటావోనని.

చాలా మంది అంటుంటారు నిన్ను ఎక్కడో చూసారని, కానీ అక్కడికి వెళ్తే నువ్వు నాకు దొరకవు, బాధతో వెనకకు వచ్చేస్తాను. నువ్వు ఎందుకు కనపడలేదో అని ఆలోచిస్తాను.

కానీ ఆ ఆలోచన చేస్తున్నపుడు నేను నీ ఒడి లోనే ఉన్నట్టు అనిపిస్తుంది, చంటి బిడ్డ అమ్మ వొడిలో ఉన్నట్టు అనిపిస్తుంది.

అందుకే అన్నాను నీకు దగ్గరగా నేను ఉండేది నిన్ను నేను వెతికేటప్పుడే అని.

అందుకే నాకు నువ్వు కనపడకు, నేను ఇలానే వెతకని, ఇలానే నీకోసం బాధపడని,

కానీ నువ్వు నాకు దొరకకు. ఎందుకంటే నువ్వు ఏరోజైతే కనపడతావో, అక్కడితో నిన్ను వెతకడం ఆగిపోతుంది.

అక్కడితో నీ ఒడి లోంచి నన్ను పక్కన పెట్టేస్తావేమో! వొద్దు. నాకు అది వదిలి రావాలని లేదు.

నాకు కనపడకుండా, ఉండిపో నా వెతుకులాట లో.

ఎందుకంటే ఆ వెతుకులాటలో ఈ లోకాన్నంతా చూస్తాను, అన్నిటిలో చూస్తాను నువ్వే ఉంటావేమో అని ఆశతో. అందుకే నేను శ్వాస తీసుకునే వరకు, నాకు కనపడకు.

కనపడకు, కనపడకు, కనపడకు.